Chapter 1
1. దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న పండ్రెండు గోత్రములవారికి శుభమని చెప్పి వ్రాయునది. 2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, 3. మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. 4. మీరు సంపూర్ణులును, అనూ నాంగులును,ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. 5. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. 6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. 7. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు 8. గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు. 9. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నతదశ యందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. 10. ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును. 11. సూర్యుడు దయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును. 12. శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. 13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడునేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు. 14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. 15. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. 16. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. 17. శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు. 18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. 19. నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను. 20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. 21. అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. 22. మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి. 23. ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. 24. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా 25. అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును. 26. ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే. 27. తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించు టయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
Chapter 2
1. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి. 2. ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు,మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల 3. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించినీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితోనీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల 4. మీ మనస్సులలో భేదములు పెట్టుకొనిమీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా? 5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవు డేర్పరచుకొనలేదా? 6. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చు చున్న వారు వీరే గదా? 7. మీకు పెట్టబడిన శ్రేష్ఠమైన నామమును దూషించువారు వీరే గదా? 8. మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు. 9. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. 10. ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును; 11. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్యచేయ వద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్రవిషయములో నపరాధి వైతివి. 12. స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగు ననే ప్రవర్తించుడి. 13. కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును. 14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయో జనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా? 15. సహోదరు డైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక యున్నప్పుడు. 16. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యకసమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? 17. ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. 18. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలు లేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును. 19. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగునమ్ముట మంచిదే; దయ్యములును నమి్మ వణకుచున్నవి. 20. వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? 21. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించి నప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొంద లేదా? 22. విశ్వాసము అతని క్రియలతోకూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా? 23. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితు డని అతనికి పేరుకలిగెను. 24. మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతి మంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి. 25. అటువలెనే రాహాబను వేశ్యకూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా? 26. ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.
Chapter 3
1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. 2. అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగ 3. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా 4. ఓడలనుకూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును. 5. ఆలాగుననే నాలుకకూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును! 6. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీర మునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును. 7. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతిచేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని 8. యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. 9. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము. 10. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండ కూడదు. 11. నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా? 12. నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు. 13. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను. 14. అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్య మునకు విరోధముగా అబద్ధమాడవద్దు. 15. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. 16. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును. 17. అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనిన 18. నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.
Chapter 4
1. మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా? 2. మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు. 3. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు. 4. వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. 5. ఆయన మనయందు నివ సింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? 6. కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేతదేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును అని లేఖనము చెప్పుచున్నది. 7. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. 8. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. 9. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. 10. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును. 11. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చు చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి. 12. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? 13. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువార లారా, 14. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. 15. కనుకప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. 16. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. 17. కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.
Chapter 5
1. ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవ ములను గూర్చి ప్రలాపించి యేడువుడి. 2. మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను. 3. మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి. 4. ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. 5. మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. 6. మీరు నీతి మంతుడైనవానికి శిక్షవిధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. 7. సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా 8. ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచు కొనుడి. 9. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. 10. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవ మునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. 11. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు. 12. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశముతోడనిగాని భూమితోడనిగాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. 13. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను. 14. మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను. 15. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును. 16. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. 17. ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమిమీద వర్షింపలేదు. 18. అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్ష మిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. 19. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్య మునకు మళ్లించినయెడల 20. పాపిని వాని తప్పుమార్గమునుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను.
(April28th2012)
|