Chapter 1
1. మన తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. 2. తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 3. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై యున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధిపొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించు చున్నది. 4. అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయ పడుచున్నాము. 5. దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది. 6. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, 7. దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు 8. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. 9. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును,ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు 10. ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏల యనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమి్మతిరి. 11. అందువలన మన దేవునియొక్కయు ప్రభువైన యేసు క్రీస్తుయొక్కయు కృపచొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు, 12. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించుచున్నాము.
Chapter 2
1. సహోదరులారా, ప్రభువుదినమిప్పుడే వచ్చి యున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల 2. మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము. 3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగుపాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు. 4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచు కొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి. 5. నేనింకను మీయొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా? 6. కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డ గించునది ఏదో అది మీరెరుగుదురు. 7. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును. 8. అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును. 9. నశించుచున్నవారు తాము రక్షింప బడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను 10. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును 11. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, 12. అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 13. ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము. 14. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. 15. కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. 16. మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, 17. మీ హృదయ ములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతిసద్వాక్య మందును మిమ్మును స్థిరపరచును గాక.
Chapter 3
1. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువువాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తమును, 2. మేము మూర్ఖులైన దుష్టమనుష్యుల చేతిలోనుండి తప్పింపబడు నిమిత్తమును, మాకొరకు ప్రార్థించుడి; విశ్వాసము అందరికి లేదు. 3. అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వమునుండి3 కాపాడును. 4. మేము మీకు ఆజ్ఞా పించువాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదు రనియు ప్రభువునందు మిమ్మునుగూర్చి నమ్మకము కలిగి యున్నాము. 5. దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. 6. సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకా రముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. 7. ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు; 8. ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితివిు. 9. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితివిు గాని, మాకు అధికారములేదనిచేయలేదు. 10. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు--ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞా పించితివిు గదా. 11. మీలోకొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. 12. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. 13. సహోదరు లారా, మీరైతే మేలుచేయుటలో విసుకవద్దు. 14. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. 15. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. 16. సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక. 17. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయు చున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే. 18. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికి తోడై యుండును గాక.
(April28th2012)
|